రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల కడుపులోని ఆమ్లాలు, ఆహారం తిరిగి ఆహార నాళంలోకి వచ్చే ప్రమాదం ఉంది. శరీరం నిటారుగా ఉన్నప్పుడు జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది, కానీ తిన్న వెంటనే పడుకుంటే గుండెల్లో మంట, నోట్లో పుల్లటి రుచి వంటి యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు కనిపిస్తాయి.
ముఖ్యంగా కడుపులో ఆమ్లాల వల్ల కలిగే GERD (గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్) వంటి సమస్యలు ఉన్నవారికి ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట ఆలస్యంగా భారీ భోజనం చేయడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తి నిద్రకు ఆటంకం కలుగుతుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) ఉన్నవారిలో ఈ లక్షణాలు మరింత తీవ్రం కావచ్చు.
ఆలస్యంగా తినడం వల్ల నేరుగా బరువు పెరుగుతారని చెప్పలేమని డాక్టర్ మహాదేవన్ స్పష్టం చేశారు. రోజు మొత్తంలో తీసుకునే కేలరీల పరిమాణమే బరువు పెరగడానికి ప్రధాన కారణం. అయితే ఆలస్యంగా డిన్నర్ చేయడం, తిన్న వెంటనే పడుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు పరోక్షంగా బరువు పెరగడానికి దారితీయవచ్చు.
రాత్రిపూట ఆకలిగా అనిపిస్తే పూర్తిగా ఖాళీ కడుపుతో పడుకోవాల్సిన అవసరం లేదు. పెరుగు, మజ్జిగ, అరటిపండు, కొన్ని బాదం పప్పులు లేదా ఒక గ్లాసు గోరువెచ్చని పాలు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. నూనె పదార్థాలు, కారం, సిట్రస్ పండ్లు, కెఫీన్, కార్బొనేటెడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల శరీరం నిటారుగా ఉండి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అప్పుడప్పుడు డిన్నర్ ఆలస్యమైతే ఆందోళన చెందాల్సిన పనిలేదు, కానీ ప్రతిరోజూ రాత్రి ఆలస్యంగా తినే అలవాటు ఉంటే సమయాన్ని మార్చుకోవడం ఉత్తమం.








