బిర్యానీలో ఉండే అధిక కేలరీలు, కొవ్వు పదార్థాలు, ఘాటైన మసాలాలు రాత్రి వేళల్లో జీర్ణం కావడం కష్టమని డైటీషియన్లు వివరిస్తున్నారు. పగటిపూటతో పోలిస్తే రాత్రి వేళల్లో శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది, దీనివల్ల ఆహారం అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఈ అలవాటు వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు కలగడమే కాకుండా రాత్రి నిద్రకు కూడా ఆటంకం కలుగుతుంది. తరచూ లేట్ నైట్ బిర్యానీ తినేవారిలో అనవసరమైన కేలరీలు చేరి బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా షుగర్, ఫ్యాటీ లివర్, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం ఉన్నవారు రాత్రిపూట బిర్యానీకి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తింటే, తక్కువ పరిమాణంలో తీసుకోవడం, భోజనం తర్వాత 15 నిమిషాలు నడవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.

బిర్యానీ తిన్న వెంటనే నిద్రపోకుండా కనీసం రెండు నుంచి మూడు గంటల విరామం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణక్రియ సులువుగా జరగడానికి పెరుగు, పచ్చి కూరగాయల సలాడ్లను ఆహారంలో చేర్చుకోవాలి, అలాగే జీర్ణక్రియను మరింత దెబ్బతీసే కూల్ డ్రింక్స్ తాగడం మానుకోవాలి.