రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కోట్ల రూపాయల వ్యయంతో 117 అడ్వాన్స్‌డ్ టెక్నికల్ సెంటర్లను (ATC) ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించి, తమ నైపుణ్యాలను పెంచుకోవడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.

ఈ శిక్షణ ద్వారా జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఏడాదికి 25 లక్షల రూపాయల జీతంతో లభించే లక్షలాది ఉద్యోగాలకు యువత అర్హత సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా జర్మన్ భాష నేర్చుకోవడం ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతాయని మంత్రి వివరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధిని విస్మరించిందని, ప్రాజెక్టుల పేరుతో నిధులు దుర్వినియోగం చేసిందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై దృష్టి పెడితే, కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన చెప్పారు. త్వరలోనే దేవరకద్ర బీడీ కార్మికుల కోసం ప్రత్యేకంగా డిస్పెన్సరీని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.