రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, ఇది పచ్చి దోపిడీ పాలన అని బిజెపి ఎంపి డాక్టర్ కె లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రజల ఆస్తులను కాపాడాల్సింది పోయి, బ్రోకర్ల మాదిరిగా వ్యవహరిస్తూ భూములను లూటీ చేస్తోందని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత ఇల్లే 22ఏ (22A) నిషేధిత జాబితాలోకి చేరిందని లక్ష్మణ్ గుర్తుచేశారు. ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులను క్రయవిక్రయాలు చేయడానికి వీలుండదు. ముఖ్యమంత్రి ఆస్తికే భద్రత లేనప్పుడు, సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణలు చెప్పారంటేనే అక్కడ భారీ స్కాం జరిగిందని ప్రభుత్వం అంగీకరించినట్లేనని లక్ష్మణ్ అన్నారు. తప్పు చేయకపోతే క్షమాపణలు ఎందుకు చెబుతారని ఆయన ప్రశ్నించారు. సొంత క్యాబినెట్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ప్రైవేట్ భూములను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి మార్చడం వెనుక కుట్ర ఉందని బహిరంగంగానే అంగీకరించారని ఆయన గుర్తుచేశారు.

హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన స్థలాలను గుర్తించి, రాత్రికి రాత్రే వాటిని నిషేధిత జాబితాలో చేరుస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఆ తర్వాత సెటిల్మెంట్లు చేసుకుంటూ ప్రభుత్వం ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కును కాలరాస్తూ ఆర్టికల్ 300ఏ (Article 300A) ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

జిహెచ్‌ఎంసి (GHMC), హెచ్‌ఎండిఏ (HMDA), రెరా (RERA) అనుమతులు ఉండి, బ్యాంకులు రుణాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్ పూర్తయిన ఆస్తులను కూడా అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విధానం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన నాయకులు, ఇప్పుడు సామాన్యుల ఆస్తులనే బంగాళాఖాతంలో ముంచేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. 22ఏ పేరుతో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ఆయన సవాల్ విసిరారు.