రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లో చిట్టీల వ్యాపారం చేస్తున్న అశోక్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి స్థానికులను మోసం చేశాడు. గత కొంతకాలంగా స్థానిక మహిళలు, చిన్న వ్యాపారుల నుంచి చిట్టీల పేరుతో డబ్బులు సేకరించిన ఈ దంపతులు, భారీగా నగదు చేతికి అందగానే ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
ప్రారంభంలో చిట్టీల వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తూ స్థానికుల నమ్మకాన్ని అశోక్ చూరగొన్నాడు. ఈ నమ్మకంతోనే బాధితులు తమ కష్టార్జితాన్ని చిట్టీలలో పెట్టుబడిగా పెట్టారు. అయితే, అనుకున్న మొత్తం చేతికి రాగానే అశోక్ దంపతులు ప్లాన్ ప్రకారం అదృశ్యమయ్యారు.
తమ డబ్బులు కోల్పోయిన విషయాన్ని గుర్తించిన బాధితులు, అశోక్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.







