ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు రాజమౌళి, తన కెరీర్ ప్రారంభానికి ముందు జరిగిన వ్యక్తిగత విషయాలను గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను ఇంటర్ మొదటి సంవత్సరం ఏలూరులో చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడినట్లు ఆయన తెలిపారు.
ఆ అమ్మాయి తన క్లాస్‌లోనే ఉండేదని, ఆమెపై తనకు ఉన్న ఇష్టాన్ని చెప్పే ధైర్యం అప్పట్లో లేదని రాజమౌళి చెప్పారు. తన క్లాస్‌లోని అబ్బాయిలందరికీ ఈ విషయం తెలిసి ఉండటంతో వారు తనను ఏడిపించేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. సంవత్సరం మొత్తం ఎదురుచూసిన తర్వాత, చివరకు ఒకే ఒక్కసారి ఆమెతో మాట్లాడే అవకాశం దక్కిందని పేర్కొన్నారు.
ఆ అమ్మాయి తన ముందు కూర్చుని ఉండగా, ధైర్యం చేసి ఆమెను 'భారతి' అని పిలిచి 'ట్యూషన్ ఫీజు కట్టావా?' అని అడిగినట్లు రాజమౌళి వివరించారు. ఆ సమయంలో ఆమె వెనక్కి తిరిగి చూసిన చూపు, ఆ ఎక్స్‌ప్రెషన్స్ తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన తెలిపారు. ఆ ఒక్క చూపు కోసం తాను చాలా రోజులుగా వేచి చూశానని ఆయన పేర్కొన్నారు.
ఆ తర్వాత రాజమౌళి చదువును మధ్యలో ఆపేసి, కొన్నేళ్లకు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశారు. ఆపై సినీ రంగంలోకి ప్రవేశించారు. సినిమాల్లో పనిచేస్తున్న సమయంలో, తన కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఫ్యాషన్ డిజైనర్ రమను ప్రేమించి వివాహం చేసుకున్నారు.








