హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత ఆరు నెలల్లో మొత్తం 2,469 కేసుల్లో నిందితులకు కోర్టులు శిక్షలు విధించాయి. తీవ్రమైన (గ్రేవ్), సాధారణ (నాన్-గ్రేవ్) నేరాలన్నీ కలిపి ఈ సంఖ్య నమోదైంది. ఈ విజయానికి ప్రధాన కారణం పోలీసు శాఖ ఏర్పాటు చేసిన 'ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్' అని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ తెలిపారు.

గతంలో సమయం లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం కొరత వల్ల దర్యాప్తులో లోపాలు జరిగి నిందితులు తప్పించుకునేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అనుభవజ్ఞులైన అధికారులు, న్యాయ నిపుణులతో ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది క్షేత్రస్థాయి అధికారులకు దిక్సూచిగా నిలిచి, డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, సాక్షుల గుర్తింపులో శాస్త్రీయ పద్ధతులు అమలు చేయిస్తోంది.

ముఖ్యంగా పోక్సో (బాలల లైంగిక నేరాల చట్టం), మహిళలు, చిన్నారులపై జరిగే కేసుల దర్యాప్తును ఈ సెల్ వేగవంతం చేస్తోంది. నిర్దేశిత గడువులోనే చార్జ్‌షీట్లు దాఖలు చేయడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుని విచారణ సజావుగా సాగేలా చూడటం దీని బాధ్యత. ఫలితంగా ఇటీవల సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బాలుడి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష పడింది.

వివరాల ప్రకారం, ఈ 2,469 కేసుల్లో 18 కేసుల్లో 20 ఏళ్లకు పైగా జైలు శిక్షలు, 12 కేసుల్లో జీవిత ఖైదులు ఖరారయ్యాయి. ఒక కేసులో ఉరి శిక్షను కూడా కోర్టు విధించింది. దర్యాప్తు నాణ్యత పెరగడంతో న్యాయస్థానాల్లో కన్విక్షన్ రేటు క్రమంగా పెరుగుతోందని సీపీ సజ్జనర్ అన్నారు.