మహారాష్ట్రలోని పూణె జిల్లా పింప్రి ప్రాంతంలో నివసిస్తున్న 50 ఏళ్ల వినోద్ పిళ్లై, ఆయన భార్య 45 ఏళ్ల సిర్జా, 19 ఏళ్ల కుమార్తె పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మరణించారు. వినోద్ ఐఐఎం అహ్మదాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేయగా, సిర్జా ఒక పాఠశాలలో కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.

శనివారం సిర్జా విధులకు రాకపోవడంతో సహోద్యోగులు ఆమెకు ఫోన్ చేశారు. స్పందన లేకపోవడంతో బంధువులకు సమాచారం అందించారు. వారు ఇంటికి వెళ్లి చూడగా, ముగ్గురూ అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు గదిలో ఒక సూసైడ్ నోట్‌తో పాటు సోడియం నైట్రేట్ ఉన్న డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. వినోద్ ఆన్‌లైన్‌లో ఈ రసాయనాన్ని ఆర్డర్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ రసాయనం నుంచి వెలువడిన పొగ వల్లే వారు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రికి తరలించగా వినోద్ అప్పటికే మరణించగా, చికిత్స పొందుతూ సిర్జా, పూర్ణిమ కూడా చనిపోయారు.

ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికి ఎవరూ బాధ్యులు కారని వినోద్ ఆ లేఖలో రాశారు. మూడేళ్ల క్రితం నెహ్రూ నగర్‌లోని తమ సొంత ఇంటిని విక్రయించి, అప్పటి నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నారని, భారీ అప్పులతో వారు సతమతమవుతున్నారని దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.