ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మించే అంశంపై కదలిక మొదలైంది. వార్ధా మరియు వైన్‌గంగ నదులు కలిసే చోట బరాజ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రీ ఫిజిబులిటీ నివేదికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది.

రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించిన కేంద్రం, ఈ ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)ను ఆదేశించింది. గతంలో 2008లో తమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేసినప్పటికీ, వివిధ కారణాలతో ఆ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో, అప్పటి ప్రభుత్వం కాళేశ్వరం వద్ద ప్రాజెక్టును చేపట్టింది.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి మళ్లీ చర్యలు ప్రారంభించింది. గతంలోనే మంత్రులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే, ఈ బరాజ్ నిర్మాణం సాధ్యం కావాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడం తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుకూల నివేదిక రావడంతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే ప్రాణహిత బరాజ్ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది.