ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకుంటోందని బీఆర్ఎస్ ఎంఎల్సీ దాసోజు శ్రావణ్ ఆరోపించారు. ప్రజలకు చెందిన ప్లాట్లు, పట్టా భూములను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే 22A ప్రతిబంధక జాబితాలో చేరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ జాబితాలో భూములు ఉంటే రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలుండదు. దీనివల్ల సామాన్య ప్రజలు తమ ఆస్తులను అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రావణ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఈ ప్రక్రియ పేరుతో భూ యజమానులను వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై ఇతర రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ప్రజల ఆస్తులపై ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులను వెంటనే ఆపాలని, తన చర్యలను ప్రభుత్వం మళ్లీ సమీక్షించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.








