ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పోలీసుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసన సందర్భంగా పోలీసులు తనను అక్కడి నుంచి తరలిస్తున్న సమయంలో, ఈ ప్రభుత్వాన్ని తొలగించాలని వారు తన చెవిలో గుసగుసలాడారని ఆయన పేర్కొన్నారు.
రాజస్థాన్, హర్యానాకు చెందిన పోలీసులు తనతో ఈ విధంగా మాట్లాడారని రాహుల్ గాంధీ వివరించారు. తాము కేవలం యూనిఫాం మాత్రమే ధరించామని, పోలీసు వ్యవస్థలో కూడా ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని వారు చెప్పినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులపై జరుగుతున్న ఘటనలతో పోలీసులు సంతోషంగా లేరని, విద్యార్థుల్లో వారు తమ సొంత పిల్లలను చూసుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
నిరసనలో తన నోటి నుంచి రక్తం కారిన విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. తనతో పోలీసులు ప్రవర్తించిన తీరు గురించి తాను ఆందోళన చెందడం లేదని, ప్రభుత్వం తమతో ప్రవర్తించిన దానికంటే ఐదు రెట్లు దారుణంగా వ్యవహరించవచ్చని ఆయన అన్నారు. అయితే, విద్యార్థుల డిమాండ్లకు తాము అండగా నిలబడతామని, విద్యార్థులు కోరుకుంటున్న వ్యవస్థాగత మార్పులపైనే దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.







