ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల సమయంలో 90 శాతం వరకు అవినీతి జరుగుతోందని రామ్‌దేవ్ బాబా ఆరోపించారు. అభ్యర్థుల ప్రతిభను కాకుండా, వారి కులం లేదా సామాజిక వర్గాన్ని బట్టి మార్కులు వేస్తూ అర్హులైన వారికి అన్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న నిరసనలు విద్యా వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతున్నాయని రామ్‌దేవ్ అభిప్రాయపడ్డారు. జార్ఖండ్‌తో సహా పలు ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడం, మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కొరవడటం విద్యార్థుల ఆందోళనకు ప్రధాన కారణమని ఆయన వివరించారు.
నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, కాపీయింగ్ ఉదంతాలు నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆగ్రహం పెరిగి మరిన్ని ఆందోళనలకు దారితీయక ముందే ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు.
నిరసనల పేరుతో హింసను తాను సమర్థించనని రామ్‌దేవ్ స్పష్టం చేశారు. అయితే, అవినీతి ఆరోపణలను ప్రభుత్వం తేలిగ్గా తీసిపారేయకూడదని, అధికార, ప్రతిపక్షాలు పరస్పర గౌరవంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.






