పిఠాపురం పాదగయ క్షేత్రంలో ప్రతి ఏటా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు పిఠాపురంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మహిళలు గురువారం తెల్లవారుజాము నుంచే టోకెన్ల కోసం క్యూలో నిలబడ్డారు. అయితే, వ్రతాలతో పాటు మహిళలకు పంపిణీ చేస్తామని జనసేన నేతలు ప్రకటించిన వేల చీరల టోకెన్లన్నీ వారే తీసేసుకోవడంతో, వ్రతం కోసం వచ్చిన మహిళలకు ఒక్క టోకెన్ కూడా దక్కలేదు.
మధ్యాహ్నం వరకు వేచి చూసిన మహిళలు ఆలయ అధికారులను నిలదీయగా, టోకెన్లు లేవని వారు సమాధానమిచ్చారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మహిళా పోలీసులు కాకుండా పురుష పోలీసులే మహిళలను క్యూలో నుంచి బయటకు లాగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
అక్కడి నుంచి వెళ్లకపోతే ఫొటోలు తీసి, ఇళ్ల నుంచి లాక్కొచ్చి కేసులు పెట్టి జైలులో వేస్తామని పోలీసులు మహిళలను బెదిరించారు. దీనిపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దొంగలమా అని ప్రశ్నిస్తూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు నిలదీశారు.
మరోవైపు, అక్కడికి వచ్చిన కొందరు జనసేన నేతలు మహిళలంతా చీరల కోసం వచ్చారని అవహేళన చేశారు. తాము చీరల కోసం రాలేదని, అమ్మవారి సన్నిధిలో వ్రతం చేసుకుందామని వచ్చామని మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. వ్రతాల నిర్వహణతో తమకు సంబంధం లేదని ఆలయ అధికారులు చెప్పడంతో, ఆలయంలో వ్రతాలు ఎలా నిర్వహిస్తున్నారని భక్తులు అధికారులను ప్రశ్నించారు.
ఈ ఘటనపై ఆలయ అధికారులు ఎటువంటి స్పందన తెలపలేదు. వ్రతాల కోసం వచ్చిన మహిళలకు జరిగిన అవమానంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.








