నేపాల్‌లో వరదల వల్ల జరిగిన విధ్వంసం తర్వాత, ఇద్దరు చిన్నారులు తమ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. ఐదేళ్ల చిన్నారి తన రెండేళ్ల తమ్ముడిని వీపుపై కట్టుకుని, వరదల్లో కొట్టుకుపోయిన తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న వీడియో అందరినీ కలచివేస్తోంది.

ఈ వీడియోలో చిన్నారుల ముఖాలపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి అమాయకపు ముఖాల్లో ఉన్న బాధను చూసి నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోను ఆదివారం (ఆగస్టు 30) Jeet అనే ఎక్స్‌ (X) ఖాతాలో షేర్ చేశారు. పోస్ట్ చేసిన నాలుగు గంటల వ్యవధిలోనే ఈ వీడియోను 6 లక్షల 40 వేల మందికి పైగా వీక్షించారు.

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు సురక్షితంగా దొరకాలని చాలా మంది దేవుడిని ప్రార్థిస్తుండగా, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నారు.

అయితే, ఈ వీడియోపై సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది పాత వీడియో అని కొందరు, ఇది నకిలీ (ఫేక్) వీడియో అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఎక్కువ మంది దీనిని ఇటీవలి నేపాల్ విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలుగానే భావిస్తున్నారు.