మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 2023లో జరిగిన శిశువు హత్య కేసులో నిందితుడైన గోపీనాథ్ జాంకు ప్రధాన్‌కు ముంబై హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సెప్టెంబర్ 9న ఈ మేరకు జస్టిస్ ఎంఎం నెర్లికర్ ఉత్తర్వులు జారీ చేశారు. తన కుమారుడు, కోడలకు రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో, ఆ పసికందును టబ్‌లో ముంచి ప్రధాన్ చంపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ప్రధాన్ కోర్టులో ఖండించారు. తాను నిర్దోషినని, ఈ కేసులో నిందితురాలిగా ఉన్న చిన్నారి తల్లికి ఇప్పటికే బెయిల్ లభించిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, కుటుంబంలో మరో ఆడపిల్ల వద్దనుకోవడం వల్లే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది.
నేరం జరిగిన తీరుపై జస్టిస్ నెర్లికర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చిన్నారి మరణం తర్వాత నిందితులు అందరూ కలిసి ఎవరో చంపేశారని హంగామా చేశారని, హడావిడిగా అంత్యక్రియలు జరిపారని కోర్టు పేర్కొంది. నిందితుడి ప్రవర్తన, నేరం జరిగిన తీరును పరిశీలించిన తర్వాత అతనికి ఎలాంటి ఉపశమనం కల్పించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 80 ఏళ్లు గడిచినా, ప్రజలు ఇప్పటికీ మగబిడ్డకే ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమని జస్టిస్ నెర్లికర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పోలీసులు ప్రధాన్‌పై హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడికి బెయిల్ లభించలేదు.








