జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోయి ఉంటే, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రజలు భారత్‌లో చేరేందుకు తిరుగుబాటు చేసేవారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. పీఓకే ప్రజల ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే బాధగా ఉందని, వారి కోసం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో కొన్ని సీట్లను ఖాళీగా ఉంచామని ఆయన తెలిపారు. ఆ సీట్లు ఏదో ఒకరోజు నిండుతాయన్న ఆశతో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

1947లో పాకిస్థాన్ దురాక్రమణలను కశ్మీర్ ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారని ఒమర్ గుర్తు చేశారు. సరిహద్దుల్లోని పరిస్థితులను చూస్తుంటే మన పూర్వీకుల మాటలు నిజమని అర్థమవుతోందని, దేశంపై దాడికి దిగేవారికి బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సునీల్ శర్మ తీవ్రంగా ఖండించారు. స్వాతంత్య్ర దినోత్సవం వంటి వేదికను ముఖ్యమంత్రి రాజకీయాలకు వాడుకుంటున్నారని, ఆయన బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని సునీల్ శర్మ విమర్శించారు.