విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, శాశ్వత పరిష్కారం చూపేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. ప్రతి విద్యా సంవత్సరానికి అవసరమైన రూ.2,200 కోట్లను ముందుగానే కేటాయించి, సకాలంలో విద్యార్థుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లకు చేరుకున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతతో నిధుల విడుదలను చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతలు రామచంద్రరావు, ఆర్. కృష్ణయ్యల విమర్శలపై స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసిన తర్వాతే తెలంగాణపై మాట్లాడాలని సూచించారు.
రాష్ట్రంలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించే హైడ్రా (HYDRAA) కార్యకలాపాలపై కూడా సీఎం స్పష్టత ఇచ్చారు. ఆక్రమణదారులతో రాజీ పడే ప్రసక్తే లేదని, హైడ్రా తన పనిని కొనసాగిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
బతుకమ్మ కుంట భూ ఆక్రమణ అంశాన్ని ప్రస్తావించిన సీఎం, 10 ఎకరాల భూమిని కబ్జా చేసిన వ్యక్తి కేసీఆర్ పర్యటనలో పూల వర్షం కురిపించారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చట్టాలను తీసుకురావడంతో పాటు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.








