దేశవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న E20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) మిశ్రమాన్ని అంతకంటే పెంచే ప్రతిపాదనపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గడం లేదా ఇంజిన్ పనితీరు దెబ్బతినడం వంటి అంశాలపై వాహనదారుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది.
పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ మాట్లాడుతూ, ఇథనాల్ శాతాన్ని పెంచే విషయంలో ప్రభుత్వం తొందరపడి నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు. ముందుగా సాంకేతిక పరిశీలనలు, శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆటోమొబైల్ కంపెనీలు, చమురు సంస్థలు మరియు పరిశోధనా విభాగాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఆయన వివరించారు.
కాలుష్యాన్ని తగ్గించడం మరియు ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలుపుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ తయారవుతుండటంతో, దీని వినియోగం పెరిగితే రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. 2013-14లో 1.5 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమం, 2025-26 నాటికి 20 శాతానికి చేరుకుంది.
భారత్ ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని సాధించింది. భవిష్యత్తులో ఈ శాతాన్ని మరింత పెంచుతారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.








