అరిజోనా యూనివర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ చదువుతున్న బచ్చిగారి వరుణ్, తన ప్రియురాలు జులిస్సా రూబీ సలజార్‌ను ఈ నెల 6న టక్సన్ సిటీలోని ఆమె అపార్ట్‌మెంట్‌లో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం వరుణ్ జర్మనీ మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా, విమానం దిగుతుండగా జర్మనీలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

హత్య తర్వాత వరుణ్, సలజార్ ఫోన్ మరియు క్రెడిట్ కార్డులను తీసుకుని ఆమె తల్లికి మెసేజ్‌లు పంపుతూ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. ఆ మెసేజ్‌లపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అదే రోజు సాయంత్రం టక్సన్ అగ్నిమాపక సిబ్బంది సలజార్ అపార్ట్‌మెంట్‌కు చేరుకోగా, మెడపై గొంతు నులిమిన గుర్తులు ఉన్న ఆమె మృతదేహం లభ్యమైంది.

వరుణ్‌పై గతంలోనే దాడి మరియు ఉద్దేశపూర్వకంగా గాయపరచినట్లు పిమా కౌంటీ కోర్టులో కేసులు నమోదయ్యాయి. గత ఏడాది చివరి నుంచి సలజార్ అతడికి దూరంగా ఉంటున్నట్లు, గృహ హింస కారణంగా తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. వరుణ్ యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురయ్యాడని, ఉద్యోగం కోల్పోవడంతో అద్దె చెల్లించే స్థితిలో లేడని ఫాక్స్ న్యూస్ నివేదించింది.

ప్రస్తుతం వరుణ్‌ను అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. అతడిని అరిజోనాకు తరలించిన తర్వాత పిమా కౌంటీ అడల్ట్ డిటెన్షన్ కాంప్లెక్స్‌లో ఉంచనున్నారు.