చాలామంది ఇంట్లో బిర్యానీ వండేటప్పుడు చికెన్, బియ్యం పరిమాణం తెలియక ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల రెస్టారెంట్ స్థాయి రుచి రాదు. దీనికి పరిష్కారంగా చెఫ్‌లు 1:1 నిష్పత్తిని సూచిస్తున్నారు. అంటే 500 గ్రాముల బాస్మతి బియ్యానికి 500 గ్రాముల చికెన్ తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్ ఫలితం ఉంటుంది. ఒకవేళ చికెన్ ముక్కలు ఎక్కువగా కావాలనుకుంటే, బియ్యాన్ని అర కిలోగానే ఉంచి చికెన్ పరిమాణాన్ని 750 గ్రాములకు పెంచుకోవచ్చు.
బియ్యం ఉడికించేటప్పుడు 100 శాతం ఉడికించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మసాలా నీటిలో బియ్యాన్ని వేసి, అది 70 నుండి 80 శాతం ఉడికిన తర్వాతే నీటిని వడకట్టాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ విషయంలోనూ జాగ్రత్త అవసరం. ప్రతి అర కిలో బియ్యానికి 3 మధ్యస్థ పరిమాణపు ఉల్లిపాయలను మాత్రమే బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఎక్కువ వాడితే బిర్యానీ తీపిగా మారే అవకాశం ఉంది.
బిర్యానీకి హోటల్ తరహా సువాసన రావాలంటే దమ్ పద్ధతి కీలకం. మందపాటి పాత్రలో చికెన్, సగం ఉడికిన అన్నాన్ని పొరలుగా వేసి, మూతను గోధుమ పిండితో గాలి బయటకు పోకుండా సీల్ చేయాలి. మొదట 5 నిమిషాలు అధిక మంట మీద, ఆ తర్వాత బరువైన పెనం పెట్టి 15 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
చివరగా, గ్యాస్ ఆర్పిన వెంటనే మూత తీయకుండా 10 నిమిషాల పాటు ఆవిరి మీద అలాగే ఉంచాలి. ఈ రెస్టింగ్ టైమ్ వల్ల మసాలా సువాసనలు చికెన్ ముక్కలకు బాగా పడతాయి. ఈ పద్ధతులను పాటిస్తే ఇంట్లోనే హోటల్ స్థాయిలో బిర్యానీని సిద్ధం చేసుకోవచ్చు.








