ఐపీఎల్ ద్వారా గుర్తింపు పొందిన పాండ్యా సోదరులు హార్దిక్, కృనాల్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో వీరిద్దరూ కలిసి ఉన్నట్లుగా ఉన్న ఫొటోలు కనిపించగా, అవి పాతవని, ప్రస్తుతం వారు మాట్లాడుకోవడం లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ ఔటైనప్పుడు కృనాల్ సంబరాలు చేసుకోవడం, ఆపై ఆర్సీబీ టైటిల్ గెలిచినప్పుడు హార్దిక్ సోషల్ మీడియాలో స్పందించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని ఇచ్చాయి.
ఈ ప్రచారంపై కృనాల్ పాండ్యా స్పందిస్తూ, తాము ఇద్దరం క్రికెట్ ఆడేటప్పుడు ఆటలోని వ్యూహాలు, టెక్నిక్ గురించి చర్చించుకుంటామని తెలిపారు. ఒకే క్రీడలో ఉన్న సోదరులుగా ఒకరికొకరు అండగా ఉంటామని, తమ మధ్య ఆరోగ్యకరమైన చర్చలే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. పాండ్యా కుటుంబంలో మొత్తం 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉండటం చిన్న విషయం కాదని, హార్దిక్ 5, తాను 5 టైటిళ్లు గెలిచామని కృనాల్ గుర్తు చేశారు.
మరోవైపు, టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తొడ కండరాల గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఆయన రీహాబిలిటేషన్ పొందుతున్నారు. 2027 వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని, హార్దిక్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించేలా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంటోంది.








