సామజవరగమన, మృత్యుంజయ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి రెబా మోనికా జాన్ తల్లిగా ప్రమోషన్ పొందింది. జులై 22 సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు తనకు కూతురు జన్మించిందని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్త జోమన్ జోసెఫ్, నవజాత శిశువుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ, పాపకు కియారా జోసెఫ్ అని పేరు పెట్టినట్లు తెలిపింది.
బెంగళూరుకు చెందిన రెబా మోనికా 2016లో మలయాళ చిత్రం జకబింటే స్వర్గరాజ్యం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 20 సినిమాల్లో నటించింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన మృత్యుంజయ్ చిత్రంలో ఆమె పోలీస్ అధికారిగా కనిపించింది. అంతకుముందు ఏప్రిల్ చివరలో థాయ్‌లాండ్‌లో భర్తతో కలిసి దిగిన ఫోటోల ద్వారా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంది.
రెబా మోనికా, జోమన్ జోసెఫ్ లది ప్రేమ వివాహం. 2022లో పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. జోమన్ జోసెఫ్ ఒక ఎమ్మెన్సీ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తూనే, సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రెబా మోనికా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.








