భారతదేశంలో నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించింది. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఇప్పుడు పాకిస్థాన్‌లో 'కాక్రోచ్ పార్టీ పాకిస్థాన్' పేరుతో కొత్త రాజకీయ ఉద్యమం తెరపైకి వచ్చింది. అయితే, భారత్‌లోని కాక్రోచ్ జనతా పార్టీతో తమకు ఎటువంటి అధికారిక సంబంధం లేదని ఈ సంస్థ స్పష్టం చేసింది.

మే నెలలో ప్రారంభమైన ఈ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పటికే 1.12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కెనడా నుంచి ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు సమాచారం. సల్మాన్ తరార్‌ను సంస్థ ఛైర్మన్‌గా పేర్కొంటూ, పార్టీ పదవుల కోసం దరఖాస్తులను కూడా ఈ సంస్థ ఆహ్వానిస్తోంది.

'పాకిస్థాన్ ప్రజలకు చెందింది, అవినీతి మాఫియాలకు కాదు' అనే నినాదంతో వీరు ప్రచారం చేస్తున్నారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ ఉద్యమంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రస్తుత పాలనా వ్యవస్థ విఫలమైందని అంగీకరించిన ఆయన, యువత ఐక్యమైతే పరిస్థితులను తలకిందులు చేయగలరని పేర్కొన్నారు.

యువతను ఉద్దేశించి 'కాక్రోచ్‌లు' అని సంబోధించిన ఆయన, వారు ఒక్కటైతే మార్పు సాధ్యమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, పాకిస్థాన్‌లోని తీవ్ర రాజకీయ ధ్రువీకరణ మధ్య ఈ సంస్థ ఎంతవరకు మద్దతును కూడగట్టుకోగలదనేది వేచి చూడాలి.

ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతిపై యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ఈ ఉద్యమం ప్రతీకగా నిలుస్తోంది.