దేవాలయాల నిర్వహణ, భూములు, ట్రస్టులు, నిధులు, నియామకాలు వంటి సున్నితమైన అంశాలను దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తుంది. భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఈ శాఖను నిర్వహించడం సవాలుతో కూడుకున్న పని. అయితే, 1960ల నుంచి ఈ శాఖను నిర్వహించిన మంత్రులకు పదవీ గండం ఉందనే సెంటిమెంట్ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది.

1962లో ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన టిఎన్ సదాలక్ష్మి, ఆలయ పరిపాలనలో సంస్కరణల కారణంగా శాఖను మార్చాల్సి వచ్చింది. 1983లో ఆంజనేయులు మంత్రిగా ఉండగానే మరణించగా, ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన వీరభద్రరావు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1994లో సింహాద్రి సత్యనారాయణ రెండోసారి ఈ శాఖను చేపట్టినప్పటికీ, పార్టీలో తిరుగుబాటు కారణంగా తొమ్మిది నెలలకే పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

వైఎస్ హయాంలో ఎం. సత్యనారాయణరావు దేవాదాయ భూముల వివాదంతో శాఖ నుంచి తప్పుకున్నారు. 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయగా, ఉమ్మడి రాష్ట్ర చివరి మంత్రి సి రామచంద్రయ్య పదవీ కాలం రాష్ట్ర విభజనతో ముగిసింది. అయితే, 2014 నుంచి 2023 వరకు దేవాదాయ శాఖను నిర్వహించిన పి.ఇంద్రకరణ్ రెడ్డి ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేశారు.

ఏపీలో మాత్రం ఈ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది. 2019 నుంచి 2022 వరకు మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాలయాల వివాదాల నేపథ్యంలో పదవిని కోల్పోయారు. తాజాగా తెలంగాణలో కొండా సురేఖకు దేవాదాయ శాఖ దక్కినప్పటికీ, యాదాద్రి ట్రస్ట్ బోర్డు, జాతర టెండర్లు, అధికారుల సమీక్షల విషయంలో వివాదాలు తలెత్తాయి.

కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత వివాదాల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేశారు. దీంతో దేవాదాయ శాఖ మంత్రులకు కలిసి రాదనే ప్రచారం మరోసారి రాజకీయ చర్చలకు దారితీసింది. ఈ శాఖకు నిజంగానే గండం ఉందా లేక రాజకీయ పరిణామాలే కారణమా అనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.