న్యూయార్క్‌లో ఉంటున్న పాకిస్తాన్ విద్యార్థి సల్మాన్ తరార్, కెనడా కేంద్రంగా 'కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్' (CPP)ను స్థాపించారు. గత మే నెలలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రారంభమైన ఈ అకౌంట్, ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తి చేసుకుని 1,12,000 మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇండియాలోని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్ఫూర్తితోనే ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్‌లో అవినీతిని నిర్మూలించడం, వారసత్వ రాజకీయాలను అడ్డుకోవడం, పారదర్శకమైన పాలన అందించడం తమ ప్రధాన లక్ష్యాలని సల్మాన్ పేర్కొన్నారు. యువతను తమ ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ, వారి గళాన్ని వినిపిస్తామని ఆయన చెబుతున్నారు. పార్టీ లోగోలో మెజారిటీ ప్రజలకు ప్రతినిధిగా ఉంటూనే, మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని, 'యునిటీ ఫెయిత్ డిసిప్లైన్' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ పార్టీ ఆన్‌లైన్ వేదికగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఆందోళనకారులపై జరుగుతున్న అణచివేతను, అక్కడి ప్రజల సమస్యలను ప్రస్తావిస్తోంది. విద్యావ్యవస్థ మెరుగుదల, ఉద్యోగ అవకాశాలు, చమురు సంక్షోభం, నీటి కొరత వంటి అంశాలపై పరిష్కారాలు చూపుతామని చెబుతూ, వివిధ హోదాల్లో పని చేసేందుకు దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది.
అయితే, పాకిస్తాన్‌లోని షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై స్పష్టత లేదు. పాకిస్తాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం కష్టమని, ఆందోళనకారులను ప్రభుత్వం తీవ్ర హింసతో అణిచివేస్తుందని తెలిసినా, సీపీపీ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.







