ఎన్నికల సంఘం కొత్త ఓటర్ నమోదు ప్రక్రియలో తల్లిదండ్రుల వివరాలను తప్పనిసరి చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఈ మార్పు అమలు చేసింది.
కొత్తగా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు డిజిటల్ ఫామ్-6లో మూడు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. తమ పేరు గత SIR జాబితాలో ఉందా, తల్లిదండ్రులు/నాయనమ్మ-తాతయ్యల వివరాలు ఉన్నాయా లేదా ఏ వివరాలూ లేవా అనేది స్పష్టం చేయాలి. మొదటి రెండు ఆప్షన్లు ఎంచుకుంటే అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి.
ఈ విధానం గతేడాది జూన్‌లో బీహార్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమై, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో విస్తరించింది. డిజిటల్ ఓటర్ మ్యాపింగ్ సులభతరం చేయడమే కాకుండా, నకిలీ ఓటర్లు, మరణించిన ఓటర్లు, వలస వెళ్లిన వారిని గుర్తించడంలో ఈ విధానం సహాయపడుతుంది.







