ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ పరిస్థితిపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా పోస్ట్‌మార్టం చేస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఒక్కసారి కూడా విజయం సాధించకపోవడం, ప్రతి ఎన్నికలో ప్రత్యర్థి పార్టీ మెజారిటీ పెరుగుతుండటంతో అధినేత జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో ఇప్పటికే కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించిన జగన్, ఇప్పుడు పాలకొల్లుపై ఫోకస్ చేశారు.

ప్రస్తుత ఇన్‌ఛార్జ్ గుడాల గోపి పనితీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను, కార్యకర్తల సమావేశాలను ఆయన తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని, ఎన్నికల ఖర్చుల విషయంలోనూ ఆరోపణలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవురు శ్రీనివాస్, డాక్టర్ బాబ్జి, గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు వంటి వారిని గతంలో ఇన్‌ఛార్జ్‌లుగా నియమించినా ఆశించిన ఫలితాలు రాలేదని, ఇప్పుడు గోపి కూడా ప్రభావం చూపలేకపోతున్నారని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు.

నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, నాయకుల మధ్య సమన్వయం లోపించడం పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. ఈ నేపథ్యంలో, ఆర్థిక బలం ఉండటంతో పాటు సామాజిక సమీకరణాలను సరిచేయగల నేత కోసం అధిష్టానం వెతుకుతోంది. కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న పాలకొల్లులో, అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దించాలని పార్టీ భావిస్తోంది.

ఈ క్రమంలోనే గతంలో ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన గుణ్ణం నాగబాబుతో పార్టీ పెద్దలు ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలోనే కొత్త ఇన్‌ఛార్జ్‌ను నియమించకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని స్థానిక శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కొత్త నాయకత్వం ద్వారానే నాలుగోసారి ఓటమిని తప్పించుకోవచ్చని వైఎస్సార్‌సీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.