తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన 2028 జూన్ 2 నాటికి వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఖరారు చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వరంగల్ చరిత్ర, సంస్కృతి దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
భూసేకరణ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిన చొరవపై కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. ఒక్క ఎకరా తక్కువ లేకుండా, చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా భూమిని సేకరించి అప్పగించారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ అథారిటీ వద్ద 700 ఎకరాల స్థలం సిద్ధంగా ఉందని, బౌండరీ వాల్ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. రన్‌వే నిర్మాణానికి సంబంధించిన టెండర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని, మరో మూడు నాలుగు వారాల్లో మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ పనులకు టెండర్లు పిలిచి పూర్తిస్థాయిలో నిర్మాణం మొదలుపెడతామని స్పష్టం చేశారు.
విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని వరంగల్ సంస్కృతి, కాకతీయ కట్టడాలు, ఆలయాల వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్మిస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఇదే సమావేశంలో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై కూడా కీలక చర్చ జరిగింది. ప్రస్తుతం రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను సివిల్ విమానాశ్రయంగా మార్చడానికి మరో 1,500 ఎకరాల భూమి కావాల్సి ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో, భూసేకరణ పూర్తయిన వెంటనే అక్కడ సివిల్, డిఫెన్స్ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వచ్చేలా కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి తెలిపారు.
దేశవ్యాప్తంగా విమానయాన మౌలిక వసతులు పెంచే లక్ష్యంలో భాగంగా, రానున్న పదేళ్లలో 'ఉడాన్' (UDAN - ప్రాంతీయ విమాన సేవల పథకం) ద్వారా రూ. 30,000 కోట్లు ఖర్చు చేసి మరో 100 కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఈ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి తన హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.






