పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని రైతన్నలకు మేలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో రూ. 1.81 లక్షల కోట్లు దుబారా చేశారని మంత్రి విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం సరిగ్గా లేదని, ఫౌండేషన్ మార్పు వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నిర్ధారించిందని ఆయన గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే ప్రమాదమని జాతీయ నిపుణుల కమిటీ సూచించిందని, అందుకే అక్కడ నీటిని నిల్వ చేయడం లేదని మంత్రి వివరించారు. అయినప్పటికీ ఎల్లంపల్లి వంటి ఇతర ప్రాజెక్టుల ద్వారానే రాష్ట్రంలో వ్యవసాయం సమృద్ధిగా సాగుతోందని, గతంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ. 80 వేల కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. నీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు ఆయన సూచించారు.