పరామర్శల పేరుతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. నేరస్తులను కలిసేందుకు వెళ్తూ, తన అనుచరులతో ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఒక నేరస్తుడిని పరామర్శించేందుకు మరో నేరస్తుడు చేపట్టిన ఈ యాత్ర ప్రజల్లో అసహ్యం కలిగిస్తోందని ఆయన అన్నారు.

జగన్ పరామర్శ యాత్ర కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రెండు గంటల్లో పూర్తయ్యే ప్రయాణాన్ని ఎనిమిది గంటల పాటు సాగదీసి, కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు సృష్టించారని ఆయన మండిపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి బాటలో ఉంటే, దాన్ని ఓర్వలేక జగన్ అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు.

వైసీపీని నేరస్తులను తయారు చేసే ఫ్యాక్టరీగా అభివర్ణించిన అచ్చెన్నాయుడు, శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా పోలీసులపై ఆ పార్టీ నాయకులు ప్రవర్తించిన తీరు హేయమని ఖండించారు. జైలు నిబంధనలపై కనీస అవగాహన లేని వ్యక్తిలా జగన్ వ్యవహరిస్తున్నారని, ములాఖత్ సమయం ముగిసిన తర్వాత కావాలనే ఆలస్యంగా వెళ్లి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

నిజంగా బాధితులపై చిత్తశుద్ధి ఉంటే, మాజీ మంత్రి కుమారుడి వాహనం ఢీకొని మరణించిన దానయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించి ఉండాల్సిందని మంత్రి గుర్తు చేశారు. దానయ్య కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకుందని, మంత్రులు స్వయంగా వెళ్లి ఆర్థిక సాయం అందించారని ఆయన తెలిపారు. బాధితుడిని వదిలేసి నిందితుడిని పరామర్శించే ఏకైక నేతగా జగన్ మిగిలిపోతారని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.