శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కడుపులో గ్యాస్ సమస్య, వాంతులతో బాధపడుతున్న ప్రేమ్‌బాబును కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 2 గంటలకు నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ విభాగంలో ప్రాథమిక చికిత్స చేసి, సెలైన్ ఎక్కించిన తర్వాత అతడిని వార్డుకు మార్చారు.

వార్డులో ఉన్న సమయంలో ప్రేమ్‌బాబుకు కడుపు నొప్పి, ఆయాసం తీవ్రమయ్యాయి. మూత్రం రావడం లేదని నర్సుకు పలుమార్లు చెప్పినా, రాత్రంతా ఏ డాక్టరూ వచ్చి చూడలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు ప్రేమ్‌బాబు మృతి చెందాడు.

రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని, నాలుగు వార్డులకు ఒకే నర్సు ఉండటంతో సేవలు సరిగ్గా అందడం లేదని మృతుడి బంధువు రాజు విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై నిజ నిర్ధారణ కోసం విచారణ జరుపుతున్నట్లు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (RMO) డాక్టర్ వరప్రసాదరావు తెలిపారు. విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.