కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో, గురువారం లోక్‌సభలో E20 ఇంధనంపై సభ్యుల ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు.
E20 ఇంధనం వాడకం వల్ల ఇంజిన్ వైఫల్యాలు సంభవిస్తాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. డైనమోమీటర్ పరీక్షలు, రోడ్డుపై నిర్వహించిన ట్రయల్స్‌లో ఎటువంటి లోపాలు కనిపించలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా, సాధారణ పెట్రోల్ (E10)తో పోలిస్తే E20 ఇంధనం వల్ల కార్బన్ ఉద్గారాలు దాదాపు 30 శాతం వరకు తగ్గుతాయని, వాహనాలకు మెరుగైన ఏక్సాలరేషన్ లభిస్తుందని ఆయన వివరించారు.
పాత వాహనాల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు అవసరమని గడ్కరీ సూచించారు. 2016కు ముందు తయారైన BS-3 ప్రమాణాలు కలిగిన వాహనాల్లోని కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్‌కెట్లను సాధారణ సర్వీసింగ్ సమయంలో మార్చాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే, పాత కార్లు లేదా ద్విచక్ర వాహనాల ఇంజిన్లలో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని, వాటి పనితీరులో పెద్దగా తేడాలు లేవని అధ్యయనాలు చెబుతున్నాయని ఆయన తెలిపారు.
ప్రభుత్వం శాస్త్రీయంగా, దశలవారీగా ఈ ఇంధన విధానాన్ని అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాహన తయారీదారులు కూడా E20 ఇంధనానికి అనుగుణంగా వాహనాల వారంటీలను గౌరవిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.








