ఉత్తరాఖండ్‌లోని నీతి వ్యాలీలో తమాక్ కాలువపై ఉన్న బేలీ వంతెన భారీ వరదలకు కొట్టుకుపోయింది. దీంతో జోషిమఠ్-నీతి రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వంతెన కూలిపోవడంతో సరిహద్దు ప్రాంతాలతో పాటు సుమారు పన్నెండు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

వరద ఉధృతికి వంతెన కొట్టుకుపోతున్న సమయంలో, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)కు చెందిన డ్రైవర్ పంకజ్ నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. బలమైన ప్రవాహం కారణంగా ఆయన గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలను రంగంలోకి దించారు.

ప్రస్తుతం వరద హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఈ ప్రాంతం వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సమస్యలను ఎదుర్కొంది. ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో రాకపోకలు సాధ్యమవుతాయని BRO అధికారులు తెలిపారు.