నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులుగా తేలిన వారికి మరణశిక్ష విధించాలని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఆకాంక్ష చతుర్వేది తల్లి నీలం చతుర్వేది డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన తమకు ఒరిగేదేమీ లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల ఆకాంక్ష చతుర్వేది, నీట్ కోచింగ్ కోసం నాగ్‌పూర్‌లో నివసిస్తోంది. మే 3న జరిగిన పరీక్షను తాను చాలా బాగా రాశానని, 650కి పైగా మార్కులు వస్తాయని ఆమె నమ్మకంతో ఉండేది. అయితే, పేపర్ లీకేజీ కారణంగా పరీక్ష రద్దు కావడంతో ఆకాంక్ష తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ పరిణామంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లి, మే 20న నాగ్‌పూర్‌లో ఆత్మహత్యకు పాల్పడింది.
ఆకాంక్ష రాసిన సూసైడ్ నోట్ ఆమె తల్లిదండ్రులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. 'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు, నన్ను క్షమించండి' అని ఆకాంక్ష తన లేఖలో పేర్కొంది. కూతురి చదువు కోసం అప్పులు చేసి, కష్టపడిన తండ్రి ప్రస్తుతం రెండుసార్లు గుండెపోటుకు గురై పక్షవాతంతో బాధపడుతున్నారు. తమ కుటుంబాన్ని నిలబెట్టాల్సిన కూతురు లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
విద్యార్థులు చేస్తున్న పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నామని నీలం చతుర్వేది తెలిపారు. మంత్రి రాజీనామాతో బాధ్యత ముగిసిపోదని, అసలు దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె పట్టుబట్టారు. న్యాయం జరుగుతుందనే ఆశతోనే తాము ఎదురుచూస్తున్నామని ఆమె పేర్కొన్నారు.








