తగినంత నిద్రపోయినప్పటికీ రోజంతా నీరసంగా, అలసటగా అనిపిస్తుంటే అది శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గడానికి సంకేతం కావొచ్చు. చాలామంది దీనిని బిజీ జీవనశైలి లేదా ఒత్తిడి వల్ల వచ్చే సాధారణ అలసటగా భావిస్తారు, కానీ ఐరన్ లోపం కూడా ఇందుకు ప్రధాన కారణం కావొచ్చు.
సాధారణ పరిస్థితుల్లో ఇతరులకు చలిగా అనిపించకపోయినా మీకు తరచూ చలిగా అనిపించడం, చిన్న పనులు చేసినా ఆయాసం రావడం వంటివి గమనించాలి. అలాగే, జుట్టు ఎక్కువగా రాలడం, చర్మం లేదా కనురెప్పల లోపలి భాగం పాలిపోయినట్లు కనిపించడం కూడా ఐరన్ లోపానికి సంబంధించిన లక్షణాలేనని నిపుణులు చెబుతున్నారు.
ఈ లక్షణాలు ఐరన్ లోపానికి మాత్రమే పరిమితం కావు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావొచ్చు. కాబట్టి, ఈ సమస్యలు నిరంతరం కొనసాగుతుంటే సొంతంగా ఐరన్ సప్లిమెంట్లు (ఐరన్ లోపాన్ని భర్తీ చేసే మందులు) వాడకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
ముఖ్యంగా ఒకేసారి అనేక లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. రక్త పరీక్షల ద్వారా శరీరంలో ఐరన్ స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకుని, వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.








