కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యా తనపై వస్తున్న విమర్శలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తనను పారిపోయిన అప్పులవాడిగా ముద్ర వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను 1992 నుంచే బ్రిటన్‌లో శాశ్వత నివాసిగా ఉంటున్నానని, ప్రస్తుతం యూకేలో ఉన్న చట్టపరమైన ఆంక్షల వల్లే భారత్‌కు రాలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తనకు ఘోరమైన అన్యాయం చేసిందని మాల్యా ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గత ఏడాది అక్టోబర్‌లో లోక్‌సభలో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్-2018 (ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకునే చట్టం) కింద 15 మందిని ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించారు. ఇందులో మాల్యాతో పాటు నీరవ్ మోదీ వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి.
అయితే, తాను తప్పించుకుని తిరగడం లేదని, న్యాయపరమైన బంధనాలే తనను ఆపుతున్నాయని మాల్యా కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. బ్యాంకులు, ప్రభుత్వం తన నుంచి కోర్టు తీర్పు ప్రకారం రావాల్సిన రూ.6,203 కోట్లకు గాను, ఇప్పటికే రూ.14,100 కోట్లు వసూలు చేశాయని ఆయన గుర్తు చేశారు. ఇంత మొత్తాన్ని వసూలు చేసిన తర్వాత కూడా తనను మోసగాడిగా చిత్రీకరించడం అన్యాయమని, తనకు రావాల్సిన రిఫండ్ (తిరిగి చెల్లించాల్సిన డబ్బు) సంగతేమిటని ఆయన ఎదురుదాడికి దిగారు.
మరోవైపు, మాల్యా వ్యవహారంపై బాంబే హైకోర్టు ఫిబ్రవరిలో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు విచారణలకు దూరంగా ఉంటూ న్యాయపరమైన ఉపశమనం కోరడం భావ్యం కాదని కోర్టు మందలించింది. చివరిసారిగా భారత్‌కు తిరిగి వచ్చే ఉద్దేశం ఉందో లేదో స్పష్టం చేయాలని మాల్యాను కోర్టు ఆదేశించింది.








