నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలం పందిపాడులో ఈ ఘటన జరిగింది. నెల్లూరు వి.నగర్ ప్రాంతానికి చెందిన హేమసాయికి, బద్ధకూరి మహాలక్ష్మికి వారం క్రితమే వివాహం జరిగింది.

సినిమాకు వెళ్దామని చెప్పి హేమసాయి తన భార్యను స్కూటీపై ఆత్మకూరుకు తీసుకెళ్లాడు. దారిలో ఒక నిమ్మతోట వద్దకు రాగానే, సర్ ప్రైజ్ ఉందని చెప్పి ఆమెను తోటలోకి తీసుకెళ్లాడు. భర్త మాటలను నమ్మి మహాలక్ష్మి లోపలికి వెళ్లడంతో, హేమసాయి వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో ఆమె గొంతు కోశాడు.

తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మి, రక్తం కారుతున్న స్థితిలోనే రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నెల్లూరులోని ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందుతుండగా, పరిస్థితి విషమంగా ఉంది.

ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు హేమసాయిని ప్రశ్నించగా, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మొదట అబద్ధం చెప్పాడు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా, భార్యను చంపేందుకు తానే ప్లాన్ చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు.

ఈ ఘటనపై ఆత్మకూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.