వర్ధన్, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన 'కాగితం పడవలు' సినిమా నేడు సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాపై విశ్వక్సేన్ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

స్కూల్ రోజుల్లోనే రాము (వర్ధన్) తన పక్క ఊరికి చెందిన గోదావరిని (కృష్ణప్రియ) ప్రేమిస్తాడు. అయితే ఒక సంఘటన వల్ల గోదావరి రామును అపార్థం చేసుకుని దూరంగా ఉంటుంది. కాలేజీ వయసులో మళ్లీ వీరిద్దరూ ప్రేమలో పడతారు. రాము స్నేహితుడు రాజేష్ (ఎంజీఆర్ తుకారాం), గోదావరి స్నేహితురాలు స్వప్న కూడా ప్రేమించుకుంటారు.

రాజేష్, స్వప్నల ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో కులం వేరనే కారణంతో పెద్దలు వారికి కఠినమైన శిక్షలు వేస్తారు. ఈ ఘటన తర్వాత వారు ఆత్మహత్య చేసుకోవడంతో రాము, గోదావరి కూడా తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకోరని భయపడి లేచిపోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగిలిన కథ.

సినిమాలో హీరో, హీరోయిన్ల నటన బాగుంది. ముఖ్యంగా కృష్ణప్రియ తన హావభావాలతో మెప్పించగా, దర్శకుడు ఎంజీఆర్ తుకారాం రాజేష్ పాత్రలో నటించారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. లొకేషన్లు సహజంగా ఉండటం, పాటలు అర్థవంతంగా ఉండటం ప్రేక్షకులకు నచ్చుతుంది.

అయితే ఫస్ట్ హాఫ్‌లో స్కూల్ ఏజ్ సీన్లు, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. ఎడిటింగ్ లో కొన్ని పాటలు, సన్నివేశాలను తొలగించే అవకాశం ఉండేది. పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు రావడంతో, ఈ కథ రొటీన్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్, అందులోని ట్విస్ట్ కూడా ఊహించదగ్గవిగానే ఉంటాయి.

మొత్తంగా చూస్తే, ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు. సాంకేతికంగా సినిమా బాగున్నా, కథాకథనాల్లో కొత్తదనం లోపించింది. ఈ రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.