వైజాగ్‌లో బేకరీ నడుపుకునే మేఘన అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో కథ మొదలవుతుంది. ఆమె ఎందుకు అదృశ్యమైంది, ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అంశాల చుట్టూ దర్యాప్తు సాగుతుంది. రాక్షసన్ సినిమాతో గుర్తింపు పొందిన అమ్ము అభిరామి ఇందులో మేఘన పాత్రను పోషించారు.

ఈ సినిమా మొదటి భాగం దర్యాప్తు వేగంగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అమ్ము అభిరామి నటనతో పాటు తండ్రి పాత్రలో గోపరాజు రమణ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆర్పీ కౌశిక్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే, కిడ్నాప్ ఆధారిత కథాంశం కొత్తది కాకపోవడంతో సినిమా విజయం పూర్తిగా దర్శకుడి అమలుపైనే ఆధారపడి ఉంది.

ద్వితీయార్థంలో కథనం సాగదీసినట్లుగా అనిపించడంతో సినిమా వేగం తగ్గుతుంది. కొన్ని సన్నివేశాలు, సంభాషణలు 2010 నాటి రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్‌ను గుర్తుకు తెస్తాయి. విలన్ ఎవరో సులభంగానే తెలిసిపోవడం, లాజికల్ లోపాలు ఉండటం సినిమాకు ప్రతికూలంగా మారాయి.

డిజిటల్ యుగంలో మొబైల్ నంబర్ ద్వారా వ్యక్తిని గుర్తించడం కష్టమని చూపించడం, హీరో తన మాజీ ప్రేయసి వాయిస్‌ను గుర్తుపట్టలేకపోవడం వంటివి సిల్లీ లాజికల్ మిస్టేక్స్‌గా కనిపిస్తాయి. ఆర్.ఆర్. ధ్రువన్ అందించిన సంగీతం థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన ఉత్కంఠను పెంచలేకపోయింది. పాటలు సినిమాకు అదనపు భారంలా మారాయి.

దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ కాగితంపై మంచి ఆలోచనతోనే కథను సిద్ధం చేసినా, తెరపై చూపించడంలో విఫలమయ్యారు. సామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించినా, ఎడిటింగ్ ముఖ్యంగా రెండో భాగంలో మరింత షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ఈ వారాంతంలో మెరుగైన సినిమాలను ఎంచుకోవడం మంచిదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.