భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు, తన భర్త వెంకట దత్తసాయి కలిసి చెన్నైలో నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతుల ఇంటికి అతిథులుగా వెళ్లారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సింధు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
ఈ సాయంత్రం చాలా అద్భుతంగా గడిచిందని, రుచికరమైన భోజనంతో పాటు మనస్పూర్తిగా సంభాషణలు జరిగాయని సింధు పేర్కొన్నారు. కొన్నిసార్లు ఇలాంటి విందులు ఎదుటి వ్యక్తి పట్ల మన దృక్కోణాన్ని మార్చి, వారిని మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
స్నేహితులుగా మొదలైన ఈ పరిచయం జీవితం, ప్రేమ వంటి విషయాల గురించి మాట్లాడుకునే స్థాయికి చేరుకుందని సింధు తెలిపారు. తాము ఒకరికొకరం చాలా ఏళ్లుగా తెలుసని, ఈ భేటీ కలకాలం కలిసి ఉంటామనే అనుభూతిని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.
చెన్నై అంటే ఇప్పటి వరకు సెంతిల్‌కుమరతి ఆంటీ మాత్రమే గుర్తుకు వచ్చేవారని, ఇప్పుడు తమ కోసం అక్కడ మరో కుటుంబం కూడా ఉందనే భావన కలిగిందని సింధు ఉద్వేగంగా చెప్పారు. విఘ్నేశ్, నయనతార తమ మనసులను దోచుకున్నారని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
సింధు చేసిన ఈ వ్యాఖ్యలపై నయనతార, విఘ్నేశ్ శివన్ స్పందించారు. మీరిద్దరూ చాలా స్వీట్‌గా ఉంటారని, మీపై తమ ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని వారు బదులిచ్చారు.
నయనతార ఇటీవల 'హాయ్' సినిమాతో ప్రేక్షకులను అలరించారు. మరోవైపు, పి.వి. సింధు ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రీక్వార్టర్స్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.








