కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ రాసిన జ్ఞాపకాల పుస్తకం 'బిలోంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' నవంబర్ 10న పాఠకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని పుస్తక ప్రచురణ సంస్థ ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్ (Alfred A. Knopf) అధికారికంగా వెల్లడించింది.

ఈ పుస్తకంలో సోనియా గాంధీ తన చిన్ననాటి జ్ఞాపకాలను, ఇటలీలో గడిపిన రోజులను పంచుకున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఇటలీలో ఆమె జీవితం ఎలా సాగింది, తన భర్త రాజీవ్ గాంధీతో పరిచయం ఎలా మొదలైందనే విషయాలను ఇందులో వివరించారు.

1965లో ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్నప్పుడు 19 ఏళ్ల సోనియా గాంధీకి రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 1968 ఫిబ్రవరి 25న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ ప్రయాణం ఆమెను భారతదేశానికి ఎలా తీసుకువచ్చిందో, ఆ నిర్ణయం ఆమె భవిష్యత్తును ఎలా మార్చిందో ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

79 ఏళ్ల సోనియా గాంధీ తన అత్తగారు ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ హత్యల గురించి కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పార్టీ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేసిన తన అనుభవాలను, దత్తత తీసుకున్న భారతదేశం పట్ల తనకున్న అనుబంధాన్ని ఆమె ఇందులో వివరించారు.

పుస్తకం ముఖచిత్రంపై సోనియా గాంధీ యవ్వనంలో ఉన్నప్పటి నలుపు, తెలుపు ఛాయాచిత్రాన్ని ముద్రించారు. ప్రపంచంలోని ప్రముఖ మహిళా నాయకులలో ఒకరైన సోనియా గాంధీ జీవిత కథను, ప్రేమను, కుటుంబాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని ప్రచురణకర్త ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.