నర్సాపురంలో ఆస్తి లావాదేవీల రిజిస్ట్రేషన్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉన్నాయని ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ నిరంజన్ శుక్రవారం ప్రకటించారు. దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్‌డౌన్ కార్యక్రమం వల్ల కార్యాలయ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆస్తి బదలాయింపులు, బ్యాంకు రుణ పత్రాల నమోదు, ఈసీ (EC) జారీ, నకలు పత్రాల ప్రతిలు మరియు మార్కెట్ విలువ వివరాలను కార్యాలయం ద్వారా యథావిధిగా అందిస్తున్నట్లు తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాల మేరకు సిబ్బంది పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఎవరి మాటలను నమ్మకుండా ప్రజలు తమ పత్రాలతో నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రావాలని నిరంజన్ సూచించారు. డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం తెలియని వారికి కూడా కార్యాలయ సిబ్బంది అవసరమైన సహకారం అందిస్తారని ఆయన భరోసా ఇచ్చారు.








