నటుడు టెంపర్ వంశీ ప్రస్తుతం టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ 10లో కంటెస్టెంట్‌గా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటులు, దర్శకులతో తనకు ఉన్న అనుభవాలను ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాధ్ వ్యక్తిత్వాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
బాలకృష్ణకు కోపం ఎక్కువ అన్న అభిప్రాయానికి భిన్నంగా, ఆయన చాలా ప్రశాంతంగా, సరదాగా ఉంటారని వంశీ వెల్లడించారు. ముంబై వెళ్తున్న సమయంలో అనుకోకుండా బాలకృష్ణ తన పక్క సీటులో కనిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు. మొదట ఆశ్చర్యపోయినా, ధైర్యం చేసి పలకరించిన తర్వాత ఇద్దరి మధ్య గంటకు పైగా సరదాగా సంభాషణ సాగిందని తెలిపారు.
ఈ ప్రయాణంలో బాలకృష్ణ తన బ్యాగేజీ కోసం ఐదు నుంచి పది నిమిషాలు వేచి చూశారని, స్వయంగా తన ఫోన్ నంబరు కూడా ఇచ్చారని వంశీ ఆశ్చర్యంగా చెప్పారు. భగవంత్ కేసరి సినిమా విడుదలకూ ముందు, ఆదిత్య 369 వంటి చిత్రాల గురించి బాలకృష్ణ తనతో అన్ని విషయాలను పంచుకున్నారని తెలిపారు. బయట ఆయన కోపిష్టి అని అనుకున్నా, దగ్గరగా ప్రయాణం చేసిన వారికే ఆయన నిజమైన వ్యక్తిత్వం అర్థమవుతుందని స్పష్టం చేశారు.
దర్శకుడు పూరి జగన్నాధ్‌ను తన గురువుగా, తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిగా వంశీ అభివర్ణించారు. పూరి జగన్నాధ్‌తో కష్టాల గురించి కాకుండా కేవలం సరదా విషయాలు మాత్రమే మాట్లాడుకుంటానని చెప్పారు. ఒంటరితనం, ఏకాంతం మధ్య వ్యత్యాసం గురించి పూరి చెప్పిన మోటివేషనల్ మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన ఎమోషనల్ అయ్యారు.
కింగ్ నాగార్జునతో కలిసి నా సామిరంగ చిత్రంలో పని చేసిన అనుభవాన్ని కూడా వంశీ పంచుకున్నారు. నాగార్జున చాలా ప్రశాంతంగా ఉంటారని, అందరితో చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. తనను ఎంతగానో ప్రోత్సహించిన నాగార్జున, రషెస్ చూసి చాలా బాగా చేశావని, పాత్ర బాగా పేలిందని ప్రశంసించారని వంశీ గుర్తు చేసుకున్నారు.








