కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ బాధ అంతాఇంతా కాదు. అలాంటి సమయంలో కుటుంబ శ్రేయస్సు కోసం వారు పెట్టిన పెట్టుబడుల కోసం మిగతా సభ్యులు నానా ఇబ్బందులు పడాల్సివస్తే మరింత కుంగుబాటు తప్పదు ఎవ్వరికైనా. అయినప్పటికీ చాలా కుటుంబాలు ఇప్పుడు ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

మదుపరి మరణానంతరం వారి కుటుంబ సభ్యులు.. రకరకాల పత్రాలను సమర్పించాల్సి వస్తున్నది మరి. ఈ క్రమంలో పేర్లలో తప్పులు, చిరునామాలో అభ్యంతరాలు, సంతకాలు సరిపోవడం లేదని..

ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు క్యాపిటల్‌ మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ.. భారతీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫీ)కు పలు సూచనలు చేసింది.

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల బదిలీ ప్రక్రియకు సాయం చేయాలని, అవసరమైన న్యాయ సంబంధిత పరిశీలనలు చేస్తూనే అసలైన క్లెయిమ్‌ల పరిష్కారానికి కృషి చేయాలంటూ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను సవరించింది. అసలు ఇందులో ఏం మారింది? మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను ఎవరు క్లెయిమ్‌ చేసుకోవచ్చు?

ఏమేం డాక్యుమెంట్స్‌ అవసరం అవుతాయి? ప్రతీ మదుపరి తెలుసుకోవాల్సింది ఏమిటో ఒక్కసారి చూద్దాం.