అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన పీ2ఎం (Person To Merchant) అంటే వ్యక్తులు వ్యాపారులకు చేసే యూపీఐ (UPI) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుంది. డిజిటల్ చెల్లింపులను నిర్వహించే సంస్థలకు చెల్లించే రుసుమునే ఎండీఆర్ అంటారు. ఈ కొత్త విధానం ద్వారా ఏటా రూ.16,000 కోట్ల ఆదాయం పేమెంట్స్ పరిశ్రమకు సమకూరుతుందని అంచనా.

ఈ నిబంధనలు కేవలం వ్యాపార లావాదేవీలకే పరిమితం. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు చేసే వ్యక్తిగత నగదు బదిలీలు (P2P) ఎంత మొత్తమైనా సరే, ఎలాంటి రుసుములు లేకుండానే కొనసాగుతాయి. అలాగే, నెలకు రూ.1 లక్ష లోపు టర్నోవర్ ఉన్న చిరు వ్యాపారులకు కూడా ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రకారం రూ.2,000 దాటిన వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీ పడుతుంది. ఉదాహరణకు రూ.50,000 విలువైన ఫోన్ కొనుగోలు చేస్తే రూ.200 రుసుము పడుతుంది, అయితే ఈ మొత్తాన్ని కస్టమర్ చెల్లించాల్సిన అవసరం లేదు. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం వంటి రంగాల్లో రూ.2,000 దాటిన లావాదేవీలకు 0.4 శాతానికి బదులుగా లావాదేవీకి రూ.5 చొప్పున స్థిరమైన రుసుమును నిర్ణయించారు.

ఈ ఎండీఆర్ ఛార్జీలను వ్యాపారులు తమ కస్టమర్ల నుంచి వసూలు చేయకుండా చూడాలని కేంద్రం బ్యాంకులను ఆదేశించింది. యూపీఐ అప్లికేషన్ల ద్వారా వినియోగదారులపై ఎలాంటి అదనపు ఫీజులు వేయకూడదని ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అయితే, వ్యాపారులు ఈ భారాన్ని కస్టమర్లపైకి నెట్టే అవకాశం ఉండటంతో, ప్రజలు మళ్లీ నగదు చెల్లింపుల వైపు మొగ్గు చూపుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

గత ఆగస్టు నెలలో జరిగిన మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో రూ.2,000 దాటిన చెల్లింపుల వాటా 67 శాతంగా ఉంది. పెద్ద మొత్తంలో షాపింగ్ చేసేటప్పుడు వ్యాపారులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తే, అది డిజిటల్ చెల్లింపుల వినియోగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.