మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు విమర్శల పాలవుతోంది. దాదాపు రూ. 7,500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును నడిపించే బాధ్యతలను ప్రభుత్వం శాశ్వత నిపుణులకు అప్పగించకుండా, రిటైర్డ్ ఉద్యోగులకు కట్టబెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో జలమండలి, హెచ్‌ఎండీఏ వంటి విభాగాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారిని, డిప్యూటేషన్‌పై వచ్చిన సిబ్బందిని ఈ అథారిటీలో కీలక పదవుల్లో నియమించారు. కొందరిని ఒప్పంద ప్రాతిపదికన, మరికొందరి పదవీ కాలాన్ని పొడిగించి మరీ సర్వీసులోకి తీసుకున్నారు. సర్వీసులో ఉన్నప్పుడు పెద్దగా ప్రతిభ చూపని అధికారులకు సైతం రికమెండేషన్ల ద్వారా కీలక బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రాజెక్టులో పర్యవేక్షణ, డిజైనింగ్, ఇంజినీరింగ్ అంచనాలు, పర్యావరణ అనుమతుల వంటి కీలక పనులను శాశ్వత ప్రాతిపదికన పనిచేసే నిపుణులు ఎవరూ లేకపోవడం యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శకులు అంటున్నారు. అంతేకాదు, ఇప్పటివరకు ఏ ఒక్క అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయి నదీ పునర్జీవన నిపుణుడితో కూడా అథారిటీ సంప్రదింపులు జరపలేదు. కేవలం పాత పద్ధతులతోనే అంచనాలు సిద్ధం చేస్తున్నారని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.
ప్రాజెక్టు అమలులో భవిష్యత్తులో ఏవైనా అక్రమాలు లేదా వైఫల్యాలు జరిగితే, బాధ్యత వహించే వారు ఎవరూ ఉండరనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని, ఎలాంటి ఆరోపణలు లేని శాశ్వత నిపుణులకు బాధ్యతలు అప్పగించాలని, లేని పక్షంలో ఈ ప్రాజెక్టు దోపిడీకి దారితీసే అవకాశం ఉందని ప్రజలు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.








