రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, డివిజన్ కేంద్రాలు, హెచ్‌ఓడీ (ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు) కార్యాలయాల వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు డిమాండ్ చేశారు.

ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు, పీఆర్సీ ఆర్థిక ప్రయోజనాలు, వేల కోట్ల పెండింగ్ బిల్లులు, సరండర్ లీవులు (ఉద్యోగులు వాడుకోని సెలవులకు బదులుగా పొందే నగదు) తక్షణమే చెల్లించాలని వారు కోరారు. రిటైర్డ్ అయిన వారికి, మరణించిన ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యుటీ (ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తం), లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రయోజనాలను ఇక వాయిదా వేయవద్దని స్పష్టం చేశారు.

జీతభత్యాల బకాయిలు అందకముందే చాలామంది పెన్షనర్లు మరణించారని, వారి అంత్యక్రియల ఖర్చులను కూడా తోటి అధికారులు సొంత డబ్బుతో భరించాల్సి వస్తోందని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాల కోసం రెండేళ్లకు పైగా సహకరిస్తున్నామని, ఇకపై తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.

ప్రకాశం జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమం విజయవంతమైందని చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, సమస్యల పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే, ఐక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.