అనకాపల్లి రూరల్ పోలీసులు సంపతిపురం జంక్షన్ వద్ద మాటువేసి, రూ. 3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాజ్‌గిరి జిల్లా చిత్రకొండ నుంచి తుని ప్రాంతానికి గంజాయిని తరలిస్తుండగా ఈ దాడులు జరిగాయి. ఈ రవాణా కోసం ఒక వ్యాన్, పైలట్ వాహనంగా ఒక హోండా సివిక్ కారును నిందితులు ఉపయోగించారు.
ఈ కేసులో షేక్ మస్తాన్ వలి, షేక్ మదీనా, పాంగి రత్న అనే ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు షేక్ మస్తాన్ వలిపై ఇప్పటికే ఐదు గంజాయి కేసులు ఉన్నాయని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. ఈ రవాణా ఒప్పందం కోసం నిందితులకు రూ. 3 లక్షల కమీషన్ ఇచ్చేలా ప్లాన్ చేశారని ఆయన తెలిపారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
మరోవైపు కడప నగరంలో ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీ చేస్తుండగా 9 కిలోల ఎండు గంజాయి దొరికింది. బుద్ధ టౌన్‌షిప్ నుంచి విశ్వేశ్వరయ్య సర్కిల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మోటుపల్లి సతీష్ చంద్ర, బొమ్మవరం రవిరాజాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అల్లూరి జిల్లా చింతలపల్లికి చెందిన కామేష్ అనే వ్యక్తి దగ్గర కిలో రూ. 5 వేల చొప్పున వీరు గంజాయిని కొనుగోలు చేశారు.
నిందితులు కొనుగోలు చేసిన 10 కిలోల గంజాయిలో ఇప్పటికే ఒక కిలోను విక్రయించారు. మిగిలిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి, డిమాండ్‌ను బట్టి ఒక్కో ప్యాకెట్‌ను రూ. 500 నుంచి రూ. 5,000 వరకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.






