పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చే ధైర్యం చేయడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. అమిత్ షా సాధారణ అంశాలపై ప్రసంగించడం తమకు ఆసక్తి లేదని, కేవలం తాము లేవనెత్తిన మూడు అంశాలపైనే ఆయన స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.

విద్యార్థులపై పెల్లెట్‌గన్స్ ప్రయోగానికి ఎవరు ఆదేశించారనేది తమ మొదటి ప్రశ్న అని రాహుల్ పేర్కొన్నారు. ఒకవేళ అమిత్ షానే ఆదేశాలిస్తే ఆయనే దోషి అవుతారని, లేనిపక్షంలో ఆయన హోంమంత్రిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేని అసమర్థుడవుతారని ఆయన వ్యాఖ్యానించారు. జంతర్‌మంతర్‌లో నిరసనకారులపై జరిగిన దమనకాండకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.

మూడవదిగా అయోధ్య రామాలయ నిధుల అవకతవకలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రధానికి సన్నిహితుడైన వ్యక్తే అయోధ్య ఆలయ నిధులను దోచుకున్నారని రాహుల్ ఆరోపించారు. పేపర్ లీక్ అంశంతో పాటు అయోధ్యలో దోపిడీపై ప్రశ్నించడం విపక్షంగా తమ బాధ్యత అని ఖర్గే స్పష్టం చేశారు. 15 రోజులుగా ప్రభుత్వం సమాధానాలు చెప్పకుండా తప్పించుకు తిరుగుతోందని ఆయన మండిపడ్డారు.