రాజమండ్రి కారు ప్రమాద ఘటనలో గాయపడిన వైద్యవిద్యార్థిని మృతి

ప్రమాదానికి కారణమైన ఇద్దరు నిందితులకు రిమాండ్

ప్రియాంకను కావాలనే ఢీ కొట్టారు: ఎస్పీ నరసింహ కిషోర్

మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటాం: ఏపీ సీఎం చంద్రబాబు

మన తెలంగాణ/హైదరాబాద్: రాజమండ్రిలో కారు ఢికొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్యవిద్యార్థిని ప్రియాంక మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఐదు రోజులుగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్టు కిమ్స్ వైద్యులు ప్రకటించారు. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి ప్రియాంక తండ్రి వెంకటేశ్ అప్పగించనున్నారు.

ప్రియాంక స్వస్థలం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్‌పూర్. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన ప్రియాంక.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుకుంటున్నది. ఈ నెల 3న రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్యమాల్ లో ఫ్రెండ్‌తో కలిసి సినిమా చూసిన ఆమె తన స్కూటర్‌పై బయటికి వెళ్తుండగా, వెనుక నుంచి కారులో నామవరానికి చెందిన సురవరపు దుష్యత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్‌లు మద్యం మత్తులో ప్రియాంక బైక్‌ను ఢీకొట్టారు.

తరువాత రెండు సార్లు బలంగా ఢీకొట్టి..ప్రియాంక తలపై నుంచి కారు పోనిచ్చారు. తీవ్రగాయాలపాలైన ఆమెను అక్కడే దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఆమె తల్లిదండ్రులు బుధవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. కిమ్స్ వైద్యులు ఆమెను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆమె కోలుకోలేకపోయింది. తన కుమార్తె మృతికి కారణమైన వారిపై సాధారణ ప్రమాద కేసు కాకుండా, హత్య కేసు నమోదు చేయాలని ప్రియాంక తండ్రి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఇది కేవలం ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు.

ఈ కేసు దర్యాప్తు వివరాలను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఇది కేవలం యాక్సిడెంట్ కాదని, నిందితుల అత్యంత క్రురమైన చర్యగా పేర్కొన్నారు. ఈ నెల 3న రాత్రి ప్రియాంక తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి వస్తున్న సమయంలో.. మాల్ వద్దకు వచ్చిన నిందితులు మద్యం మత్తులో లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అప్పుడు సెక్యురిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన నిందితులు సెక్యూరిటీపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని చెప్పారు. వారిని పట్టుకునేందుకు సిబ్బంది యత్నించడంతో నిందితులు మరింత భయపడి అత్యంత వేగంగా, నిర్లక్షంగా కారును నడిపారని ఎస్పీ తెలిపారు.

ఈ క్రమంలో రోడ్డుపై స్కూటీపై వెళ్తున్న వైద్యవిద్యార్థులను ఈ నిందితులు ఏకంగా మూడు సార్లు బలంగా ఢీ కొట్టారని..దీంతో ప్రియాంక తలకు తీవ్రంగా గాయమైందన్నారు. ప్రమాదం జరిగినా నిందితులు ఆగకుండా హిట్ అండ్ రన్ కేసులా పారిపోయారని.. అదే రోజు రాత్రి స్థానిక ఆసుపత్రి నుంచి తమకు సమాచారం అందిందని ఎస్పీ తెలిపారు. అదే రోజు రాత్రి ప్రియాంకతో పాటు ఉన్న వైద్యవిద్యార్ధి ఉమేష్ స్టేట్‌మెంట్ సేకరించి కేసు నమోదు చేశామని చెప్పారు. ఘటన జరిగిన చోట సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా, స్కూటీని కావాలనే మూడు సార్లు ఢీ కొట్టినట్లు తేటతెల్లమైందని తెలిపారు. నిందితులపై కల్పబుల్ హోమిసైడ్ అటెంప్ట్(సెక్షన్ 110) కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచగా నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.ఈ కేసులో ఇంకా మరిన్ని కఠిన సెక్షన్‌లు జత చేయనున్నట్టు ఎస్పీ తెలిపారు.

ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రటకనలో తెలిపారు. గాయపడిన ఆమె మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు తక్షణ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అదే విధంగా బాధిత కుటుంబానికి ఇతరత్రా అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని చంద్రబాబు తెలిపారు.

ప్రియాంక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజమండ్రి బంద్‌కు పిలుపునిచ్చినట్టు రాజమండ్రి మాజీ ఎంపి, వైసిపి నాయకుడు మార్గాని భరత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రియాంకకు యాక్సిడెంట్ అయ్యాక మూడు రోజుల పాటు నిందితులపై కేసు పెట్టకుండా పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ****